- గంగుల వర్సెస్ పొన్నం వర్సెస్ బండి
- బండి సంజయ్ కామెంట్స్ తో మొదలైన మాటల యుద్ధం
- బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల పోటాపోటీ కార్యక్రమాలు
- వ్యక్తిగత దూషణలతో హీటెక్కిన రాజకీయం
- పొన్నంను స్క్రాప్ తో పోల్చిన మేయర్, కార్పొరేటర్లు
- ప్రభాకర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన మహిళా కాంగ్రెస్
కరీంనగర్, వెలుగు: మంత్రి గంగుల, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎంపీ బండి సంజయ్ ముగ్గురూ బాల్య స్నేహితులే. క్లాస్ మేట్స్ అయిన గంగుల, పొన్నం ప్రభాకర్ మధ్య ఒకప్పుడు రారాపోరా దోస్తాన్ ఉండేది. బండి సంజయ్ ఏజ్ లో వారికంటే రెండు, మూడేళ్లు చిన్నవాడైనా వారిద్దరితో ఫ్రెండ్ షిప్ ఉంది. కాకపోతే కాలక్రమంలో కరీంనగర్ రాజకీయాల్లో ఈ ముగ్గురు రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థులుగా మారారు. గత ఆరు రోజులుగా జిల్లాలో వారి మధ్యే డైలాగ్ వార్ నడుస్తోంది. మీ ఇద్దరు దోస్తులంటే.. మీ ఇద్దరే దోస్తులని తాను దోస్తుని కాదని, ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తొలుత వీరి మధ్య నాలుగు రోజులు నడిచిన డైలాగ్ వార్ రెండు రోజులుగా క్యాడర్ వరకు చేరింది. తొలుత రాజకీయాలకే పరిమితమైన ఇరు నేతల వ్యాఖ్యలు.. ఆ తర్వాత వ్యక్తిగత విమర్శల స్థాయికి దిగజారడం చర్చనీయాంశంగా మారింది. పోటాపోటీ కార్యక్రమాలతో ఈ వివాదం ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించట్లేదు.
బండి సంజయ్ కామెంట్స్ తో మొదలు..
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని, కాంగ్రెస్ టికెట్లు డిసైడ్ చేసేది కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆదివారం బద్దిపల్లిలో నిర్వహించిన టిఫిన్ బైఠక్ లో చేసిన కామెంట్స్ ఆ రెండు పార్టీల్లోనూ కాక రేపాయి. సంజయ్ కామెంట్స్ పై మరుసటి రోజే సోమవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రియాక్టయ్యారు. బండి సంజయ్, గంగుల ఒకటేనని, ఒకరిపై మరొకరు పోటీ చేయొద్దని ఇద్దరి మధ్య అవగాహన ఉందని,ఈ విషయం కరీంనగర్ అంతా కోడై కూస్తోందని కౌంటర్ ఇచ్చారు. అంతేగాక బండి సంజయ్ పాదయాత్రకు ఫైనాన్స్ చేసిందే కేసీఆర్ అని, బండి సంజయ్ చేసే ఖర్చంతా గంగుల కమలాకర్ ద్వారా కేసీఆర్ భరిస్తున్నాడని పొన్నం చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో మంత్రి గంగుల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ ఔట్ డేటెడ్ లీడర్ అని, ఆయనను ప్రజలు మరిచిపోయారని, కరీంనగర్ లో కాంగ్రెస్ బలహీన పడడానికి కారణం ప్రభాకర్ అని మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బుధవారం హుజూరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి సీరియస్ గా రియాక్టయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగులపై వ్యక్తిగత దూషణ, విమర్శలకు దిగడం బీఆర్ఎస్ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో వారు అదే స్థాయిలో గురువారం రియాక్టయ్యారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా విమర్శలు హుందాగా ఉండాలని సూచించారు.
పోటాపోటీ కార్యక్రమాలు..
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను చెత్తతో పోలుస్తూ కరీంనగర్ మేయర్, కార్పొరేటర్లు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ఆవరణలో గురువారం వినూత్న రీతిలో నిరసన తెలపగా.. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు వ్యాఖ్యలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు ప్రెస్ మీట్ పెట్టి పొన్నంపై ఫైర్ అయ్యారు. ‘పొన్నం ఇప్పుడు ఒక స్క్రాప్ లాగా మారిండు. పుచ్చిపోయిన బాడీ, చెదలుపట్టిన బాడీ అని మేం కూడా మాట్లాడొచ్చు. కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. పొన్నం కరీంనగర్ లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిండు. మట్టి కప్పి దాని మీద కూర్చున్నడు. గంగుల గురించి, వినోద్ కుమార్ గురించి ఇంకోసారి ఇష్టమున్నట్లు మాట్లాడితే ఖబడ్దార్’ అని హెచ్చరించారు. దమ్ముంటే నీ ఏరియాకు చెందిన కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ మీద పోటీ చేసి గెలవాలని, గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మేయర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ శుక్రవారం మాట్లాడుతూ పొన్నంను కరీంనగర్ లో తిరగనివ్వబోమని హెచ్చరించారు.
పొన్నం చిత్రపటానికి క్షీరాభిషేకం..
బీఆర్ ఎస్ మహిళా కార్పొరేటర్లు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రసత్య ప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి తెలంగాణ చౌక్ లో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించింది మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎంపీగా పొన్నం అభివృద్ధి చేస్తే బీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని, అభివృద్ధిపై చర్చకు రావాలని శుక్రవారం డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి సవాల్ విసిరారు. నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎటుదారితీస్తాయోనని కరీంనగర్ జనం ఆసక్తిగా గమనిస్తున్నారు.